Menu

కీర్తనలు 28

OTSA

1 యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; మీరు నా కొండయై ఉన్నారు, నా మొరను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను. 2 నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి, కరుణ కొరకై నేను చేసే మొర సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి. 3 దుష్టులతో, చెడు చేసేవారితో పాటు నన్ను లాక్కు వెళ్లకండి. వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని, వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు. 4 వారి క్రియలకు వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి. చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి; వారికి తగిన ప్రతిఫలమివ్వండి. 5 యెహోవా క్రియలను గాని ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు, కాబట్టి ఆయన వారిని పడగొడతారు మరలా వారిని నిలబెట్టరు. 6 యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక. 7 యెహోవాయే నా బలం నా డాలు; హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది. నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది. నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను. 8 యెహోవాయే తన ప్రజలకు బలము. తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము. 9 మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి; వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate