కీర్తనలు 24
OTSA1 భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు. 2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు. జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు. 3 యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు? ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు? 4 ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా! 5 వారు యెహోవా నుండి దీవెన పొందుతారు వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు. 6 ఆయనను వెదికే తరం ఇదే, యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. సెలా 7 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి. 8 ఈ మహిమగల రాజు ఎవరు? శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. 9 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి. 10 ఈ మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతియైన యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. సెలా
