Menu

కీర్తనలు 146

OTSA

1 యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. 2 జీవితమంతా యెహోవాను స్తుతిస్తాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి స్తుతి పాడతాను. 3 రాజుల మీద నమ్మకం ఉంచకండి, నరులు మిమ్మల్ని రక్షించలేరు. 4 వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు; వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి. 5 ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో, ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు. 6 ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే. ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు. 7 ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు, 8 యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు. 9 యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు. 10 యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు. సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు. యెహోవాను స్తుతించండి.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate