కీర్తనలు 101
OTSA1 యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను. 2 నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను. 3 నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను. 4 కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. 5 రహస్యంగా తమ పొరుగువారిపై అభాండాలు వేసేవారిని, నేను నాశనం చేస్తాను. అహంకారపు కళ్లు, గర్వించే హృదయం గలవారిని నేను సహించను. 6 నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని. 7 మోసం చేసే వారెవరూ నా భవనంలో నివసించరు; అబద్ధాలాడే వారెవరూ నా ఎదుట నిలబడరు. 8 ప్రతి ఉదయం దేశంలోని దుష్టులందరిని నేను మౌనంగా ఉంచుతాను; యెహోవా పట్టణంలో నుండి కీడు చేసేవారిని పంపివేస్తాను.
