యెషయా 4
OTSA1 ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని “మేము మా అన్నమే తింటాము, మా బట్టలే మేము కట్టుకుంటాము; నీ పేరు మాత్రం మాకు పెట్టి మా అవమానాన్ని తీసివేయి చాలు!” అని చెప్తారు. 2 ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది. 3 సీయోనులో మిగిలిన వారికి, యెరూషలేములో ఉన్నవారికి అనగా యెరూషలేములో నివసించే వారిలో నమోదు చేయబడ్డ ప్రతివారు పరిశుద్ధులని పిలువబడతారు. 4 ప్రభువు సీయోను స్త్రీల మురికిని కడిగివేస్తారు; ఆయన తీర్పు తీర్చు ఆత్మతో, దహించే ఆత్మతో, యెరూషలేము నుండి రక్తం మరకల్ని శుభ్రం చేస్తారు. 5 అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ పందిరిగా ఉంటుంది. 6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.
