Menu

కీర్తనలు 88

IRV

1 యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను. 2 నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు. 3 నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది. 4 సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను. 5 చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు. 6 నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు. 7 నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. సెలా. 8 నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను. 9 బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను. 10 మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? సెలా. 11 సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా? 12 చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా? 13 అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది. 14 యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు? 15 చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి. 16 నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి. 17 నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి. 18 నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate