Menu

కీర్తనలు 78

IRV

1 నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి. 2 నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను. 3 మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను. 4 యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం. 5 రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు. 6 వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు. 7 మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. 8 ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు. 9 ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు. 10 వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు. 11 ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు. 12 ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. 13 ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు. 14 పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు. 15 అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు. 16 బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు. 17 అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు. 18 వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు. 19 ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? 20 ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు. 21 యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది. 22 వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు. 23 అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు. 24 ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు. 25 మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు. 26 ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు. 27 ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు. 28 అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి. 29 వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు. 30 అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే, 31 వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు. 32 ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు. 33 కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు. 34 ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు. 35 దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు. 36 అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు. 37 ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు. 38 అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు. 39 ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 40 అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు. 41 మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు. 42 ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ, 43 ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు. 44 నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు. 45 ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి. 46 ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు. 47 వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు. 48 వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి. 49 ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు. 50 తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు. 51 ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు. 52 ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు. 53 వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు. 54 తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు. 55 వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు. 56 అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు. 57 తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు. 58 వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు. 59 దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు. 60 షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు. 61 ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు. 62 తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు. 63 అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి. 64 వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు. 65 అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు. 66 ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు. 67 తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు. 68 యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు. 69 అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు. 70 తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు. 71 పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు. 72 అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate