Menu

కీర్తనలు 42

IRV

1 జింక సెలయేళ్ల కోసం దాహం గొన్నట్టుగా దేవా, నా హృదయం నీ కోసం తపించిపోతోంది. 2 నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను? 3 నా శత్రువులు ప్రతినిత్యం నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటుంటే నా కన్నీళ్ళే రేయింబవళ్ళు నాకు ఆహారమయ్యాయి. 4 జన సమూహంతో కలసి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకు వెళ్ళిన సంగతినీ, వాళ్ళతో కలసి సంతోష గానంతో, స్తుతులతో పండగ చేసుకున్న సంగతినీ జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం కరిగి నీరైపోతున్నది. 5 నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను. 6 నా దేవా, నా హృదయం నాలో నిరుత్సాహంగా ఉంది. కాబట్టి యొర్దాను ప్రదేశం నుండీ హెర్మోను పర్వతం నుండీ మిసారు కొండ నుండీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 7 నీ జలపాతాల ధ్వనికి అగాధం అగాధాన్ని పిలుస్తుంది. నీ అలలూ నీ కెరటాలూ నా పైగా ప్రవహిస్తున్నాయి. 8 అయినా పగటివేళ యెహోవా తన నిబంధన కృప కలగాలని ఆజ్ఞాపిస్తాడు. రాత్రిపూట ఆయనను గూర్చిన గీతం నాతో ఉంటుంది. నా జీవానికి దేవుడైన యెహోవా ప్రార్థన నాతో ఉంటుంది. 9 నా ఆశ్రయశిల అయిన దేవునితో ఇలా అంటాను. నువ్వు నన్నెందుకు మర్చిపోయావు? శత్రువు నన్ను అణగదొక్కుతూ ఉంటే నేను రోదిస్తూ ఎందుకు తిరగాలి? 10 నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే అది నా ఎముకల్లో బాకులాగా గుచ్చుకుంటుంది. 11 నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళనపడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.

Everything we make is available for free because of a generous community of supporters.

Donate