Menu

కీర్తనలు 27

IRV

1 యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి? 2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు. 3 నాతో యుద్ధం చెయ్యడానికి శత్రువు శిబిరం వేసుకుని ఉన్నా, నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా నేను ధైర్యంగానే ఉంటాను. 4 యెహోవాను ఒక్క సంగతి అడిగాను. దాని కోసం చూస్తున్నాను. నేను వెదుకుతున్నాను. యెహోవా సౌందర్యాన్ని చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానం చెయ్యడానికి నా జీవితకాలమంతా నేను యెహోవా ఇంట్లో నివాసం ఉండాలని అడిగాను. 5 ఆపద కాలంలో ఆయన తన పర్ణశాలలో నాకు ఆశ్రయం ఇస్తాడు. తన గుడారం చాటున నన్ను కప్పుతాడు. ఉన్నతమైన ఆశ్రయశిల మీద ఆయన నన్ను ఉంచుతాడు. 6 అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను. 7 యెహోవా, నేను స్వరమెత్తి నిన్ను అడిగినప్పుడు నా మనవి ఆలకించు. నన్ను కరుణించి నాకు జవాబివ్వు. 8 ఆయన ముఖాన్ని వెదుకు! అని నీ గురించి నా హృదయం అంటుంది, యెహోవా, నేను నీ ముఖం వెదుకుతాను. 9 నా నుంచి నీ ముఖం దాచకు. కోపంతో నీ సేవకుణ్ణి దెబ్బ కొట్టకు! నా సహాయకుడిగా నువ్వే ఉన్నావు, రక్షణకర్తవైన నా దేవా, నన్ను విడువకు, నన్ను విడిచి వెళ్ళకు. 10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తాడు. 11 యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు. 12 శత్రువులకు నా ప్రాణం అప్పగించకు. ఎందుకంటే అబద్ధ సాక్షులు నా మీదకి లేచారు, వాళ్ళు హింస వెళ్లగక్కుతున్నారు! 13 సజీవుల దేశంలో నేను యెహోవా దయ పొందుతానన్న నమ్మకం నాకు లేకపోతే నేను నిరీక్షణ కోల్పోయేవాణ్ణి. 14 యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!

Everything we make is available for free because of a generous community of supporters.

Donate